టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: జైలు నుంచి రేణుక రాథోడ్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ3గా ఉన్న రేణుకా రాథోడ్ బెయిల్‌పై గురువారం విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పూచీకత్తులు సమర్పించడంలో ఆలస్యమైవడంతో నేడు విడుదలయ్యారు. రేణుక తరపు న్యాయవాదులు గురువారం పూచీకత్తులు సమర్పించడంతో కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీలను జారీ చేసింది.
రేణుక తరపు న్యాయవాది చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ ఆర్డర్ కాపీ అందించడంతో జైలు అధికారులు రేణుకను గురువారం విడుదల చేశారు. మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతోపాటు మిగితా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పట్నుంచి రేణుక చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈ క్రమంలో రేణుక అనారోగ్యం, మహిళ కావడం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది గుమ్మకొండ శ్రీనివాసరావు తాజాగా న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా, వనపర్తిలోని గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా రేణుక పనిచేసే సమయంలో ప్రవీణ్(ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన నిందితుడు)తో పరిచయం ఏర్పడింది. టీఎస్ పీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌తో ఉన్న పరిచేయం మేరకు రేణుక ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసింది. తన భర్త డాక్యానాయక్(ఏ4 నిందితుడు), సోదరుడు రాజేశ్వర్ నాయక్ ఆ పేపర్ ను పలువురికి విక్రయించారు.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న రమేష్, ప్రశాంత్ రెడ్డికి కూడా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రమేష్ బెయిల్ ఆర్డర్ ను చంచల్ గూడ జైలుకు సకాలంలో అందించకపోవడంతో ఆయన శుక్రవారం ఉదయం విడుదల కానున్నారు. మరోవైపు, ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన పూచీకత్తులు సమర్పించకపోవడంతో కోర్టు.. బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 27 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications