హైదరాబాద్-విజయవాడ హైవేపై టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్: ప్రత్యామ్నాయం మార్గం ఇలా
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవే మార్గంలో రెగ్యూలర్ సర్వీస్ బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించారు.
'ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది' అని టీఎస్ఆ్రర్టీసీ ఎండీ తెలిపారు.

అయితే, 'ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరు' అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
కాగా, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరువాగు ఉధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Interim halt for vehicular movement on Vijayawada - Hyderabad as river Munneru overflowing on National highway.
— Naveen Reddy (@navin_ankampali) July 28, 2023
Since 2005 monsoon Munneru never reached up to highway, It’s been 18 year since last time.#Krishna river releases at Prakasam Barrage - 1,36,850 Cusecs pic.twitter.com/RLf2mK2mh6
శుక్రవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మున్నేరువాగు 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద ఇంకా పెరుగుతుందనే అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైవేపై వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications