దసరాకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు: ఛార్జీలపై..!!
హైదరాబాద్: తెలంగాణలో సద్దుల బతుకమ్మ, దసరా అతిపెద్ద పండగ. హైదరాబాద్ సహా వేర్వేరు నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరూ తమ స్వస్థలాల్లో, అయినవారి మధ్య సంబరంగా ఈ పండగను జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి సీజన్‌కూ పెద్ద ఎత్తున తరలి వెళ్తుంటారు.ఈ సీజన్‌లో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది.
అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ బస్సులు నడుస్తాయి.అక్టోబర్ 22వ తేదీన సద్దుల బతుకమ్మ, 23వ తేదీన మహార్ణవమి, 24వ తేదీన విజయదశమికి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం వల్ల ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనుంది. ఏసీ సహా అన్ని రకాల బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్లు మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్‌తో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్.. తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది.పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లే బస్సులు జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి.విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని అందుబాటులో ఉంటాయి.
గత దసరా సీజన్‌తో పోల్చుకుంటే ఈ సారి బస్సుల సంఖ్య భారీగా పెరిగింది. అప్పట్లో 4,280 ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఈ సంఖ్య 5,265కు చేరింది. రెగ్యూలర్ సర్వీసుల తరహాలోనే ప్రత్యేక బస్సుల్లో కూడా ఛార్జీలు ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయదలచుకోలేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inను సందర్శించాలి. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications