టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ: కండక్టర్లకు ఆదేశాలు జారీ..!!
TSRTC: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆరు గ్యారంటీల అమలుపై తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని కల్పించింది. అధికారంలోకి వచ్చిన మూడోరోజే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది.
ఈ పథకం సమగ్రంగా అమలు కావట్లేదంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోకు చెందిన ఓ కండక్టర్ మహిళా ప్రయాణికులకు డబ్బలు తీసుకుని టికెట్లు ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది. దీనిపై విచారణ అధికారులు విచారణ చేపట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. మహాలక్ష్మి పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు, బాన్సువాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్ సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను సజ్జనార్ స్వయంగా అందజేశారు. తెలంగాణలో నివసిస్తోన్నట్లు ఆధార్ కార్డు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునయినా చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇవ్వాలని కండక్టర్లకు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలపై ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లకు ఆది వర్తిస్తుందని వివరించారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లనూ చేస్తామని పేర్కొన్నారు.
ఉచిత బస్ ప్రయాణ పథకంపై మార్గదర్శకాలను సైతం జారీ చేశామని, 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని సజ్జనార్ గుర్తు చేశారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ తమ ఆధార్ కార్డులను కండక్టర్‌కు చూపించి.. జీరో టికెట్ తీసుకోవాలని సూచించారు.

ఉచిత ప్రయాణ పథకం అమలు తరువాత రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా బస్సులను నడిపించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సంయమనం పాటించాలని కోరారు. పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ఫోన్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications