షిర్డీ, చెన్నైతోపాటు ఏపీలోని ఈ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. షిర్డీ, చెన్నైతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ మేరకు వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
'ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించగలరు' అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

మరోవైపు, అరుణాచల గిరి ప్రదిక్షణకై తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, వచ్చే పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 29న ప్రత్యేక ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు 99599 సర్వీస్ నెంబర్‌తో సత్తుపల్లి నుంచి ప్రారంభిస్తోంది. మూడు రోజులతో కూడిన అరుణాచల గిరి ప్రదక్షిణలో శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దేవాలయాలు సందర్శిస్తూ.. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయవచ్చు అని టీఎస్ఆర్టీసీ తెలిపింది. టికెట్ ధర కేవలం రూ. 3330 మాత్రమేనని పేర్కొంది.
టీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications