KCR ఫాలోస్ జగన్: ప్రభుత్వంలో TSRTC విలీనం, ఖుషీగా ఉద్యోగులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా, ఇంతకుముందే ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీలోని ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆర్టీసీని విలీనం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెలల గడువుండగా కేసీఆర్ సర్కారు ఈ సంచలనం నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. దాదాపు ఐదు గంటలకుపైగా సాగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానుందని.. దీంతో 43వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలుగా మారనున్నారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కల సాకారం కానుందని తెలిపారు. విధి విధానాలపై సబ్ కమిటీ వేసినట్లు మంత్రి తెలిపారు.
కాగా, మరికొద్ది రోజుల్లో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్‌కు ఆర్టీసీ సంఘాల నేతలు, ఉద్యోగులు ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications