'తెలంగాణ రాబందుల సమితి': ‘దొంగల పార్టీ’ అన్న ఎంపి కవితకు టిడిపి కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిన్నటి వరకు టిడిపి అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ, నేడది తెలంగాణ దొంగల పార్టీ' అయ్యిందని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కెపి వివేకానంద రెడ్డి తిప్పికొట్టారు. టిఆర్ఎస్ అంటే 'తెలంగాణ రాబందుల సమితి' అని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమానికి దిక్సూచిగా ఉన్న నేతలను ఇప్పుడు నిర్భందిస్తున్నారని మండిపడ్డారు. బంగారు పళ్లెంతో కవిత బతుకమ్మ ఆడితే బంగారు తెలంగాణ కాదని వ్యాఖ్యానించారు.
కాగా, బుధవారం వరంగల్‌లో ఎంపి కవిత చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. ‘టీడీపీని గతంలో తెలంగాణ ద్రోహుల పార్టీ అనేది. ఇవ్వాళ దొంగలపార్టీగా మారిపోయింది. తప్పుచేస్తూ అడ్డంగా దొరికి, జైలు పాలైన వ్యక్తిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది' కవిత ఆరోపించారు.

రెండుమూడు రోజుల్లో చంద్రబాబు పార్టీ కొత్త కమిటీ ప్రకటిస్తున్నారని, అందులో ప్రధాన పదవి దక్కే అవకాశం లేదని గ్రహించే ఎర్రబెల్లి పాలకుర్తిలో గొడవ సృష్టించి ఎత్తుగడ వేశారని చెప్పారు. ఇంత లొల్లి చేసిన ప్పటికీ ఎర్రబెల్లికి కమిటీలో ప్రధానమైన పదవి దక్కలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో భవిష్యత్‌లో సైతం పుట్టగతులుండవనే భయంతోనే కాంగ్రెస్ హైరానా పడుతోందని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లు దాటినా కనీసం తాగేందుకు మంచినీళ్లవ్వని ఆ పార్టీ, ఇవ్వాళ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ వంటి శాశ్వత పథకాన్ని అమలు చేస్తుంటే భవిష్యత్‌పై ఆందోళనతో ప్రతి విషయంపై రాద్ధాం తం చేస్తున్నదని మండిపడ్డారు.
ఎర్ర పార్టీలు(కమ్యూనిస్టులు) తోకపార్టీలేనని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో లేదా ఉద్యమాలు చేయడంలో ఎక్కడైనా ఒక్కలాగే వ్యవహరించాలని, రెండు రాష్ర్టాల్లో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో అంగన్‌వాడీల కోసం ధర్నా లు చేసి, ఆంధ్రాలో చేయరెందుకని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ కార్మికుల విషయంలో ఇలాగే చేశారన్నారు. ఆశ వర్కర్ల సమస్య కేంద్రం పరిధిలోనిదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని వామపక్షాల వైఖరిని తప్పుబట్టారు.
పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్‌గా భావించి, రైతాంగాన్ని ఆదుకోవడానికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పనిచేస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రభుత్వంపై ఎంత బురద చల్లాలని చూసినా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications