కారు లోన్లు తీసుకుని బ్యాంకులకు టోకరా: ఇద్దరి అరెస్టు (ఫొటో)
హైదరాబాద్: బ్యాంకులను, వ్యాపార సంస్థలను మోసం చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లతో పాటు మరో వ్యక్తిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కర్నేందుల విజయ్‌కుమార్ చాణక్య అలియాస్ కే.జయ కుమార్(42) గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్డాల వీరవెంకట సత్యనారాయణ మూర్తి అలియాస్ మూర్తి అడ్డాల (45)తో కలిసి కొంతకాలంగా విజయ్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచి బోగస్ పత్రాలను, ఐటీ రిటర్న్స్‌ను చూపించి పలు బ్యాంకుల వద్ద కారు లోన్లు తీసుకుంటున్నారు.

లోన్ కింద తీసుకున్న కార్లను వేరొకరికి విక్రయించడంతో పాటు వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అదే విధంగా బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని సిండికేట్ బ్యాంక్ వద్ద రూ.15లక్షలను కారులోన్‌గా తీసుకుని ఓ ఇన్నోవా కారును కొనుగోలు చేసి పరారయ్యారు. అంతే కాకుండా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌లో ఉన్న ఓ మొబైల్ స్టోర్ నిర్వాహకులను నమ్మించి 62 ఐఫోన్లను కొనుగోలు చేసి రూ.35లక్షలకు చెల్లని చెక్‌లను ఇచ్చారు.
దాంతో పాటు కొనుగోలు చేసిన ఐ ఫోన్లను కోఠిలోని జగదీష్ మార్కెట్‌లో విక్రయించారు. మొత్తం ఏడు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని తేలడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు ఇన్నోవా కార్లు, రెండు హ్యుందాయ్ వెర్నా కార్లు, 23 ఐఫోన్లు, 6 ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, ఏడు ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వద్ద అక్రమంగా సెలఫోన్లను, లాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన సింగమ్ శ్రీధర్ అనే వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలోనూ వీరిపై వివిద పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 కేసులు ఉన్నట్లు ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications