తెలంగాణకు యూఏఈ గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీ కోసం ముందడుగు
ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక-2026 (World Economic Forum) సదస్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఆయన కీలక భేటీ నిర్వహించారు.
ఈ సమావేశంలో 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టనున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి దిశను వివరిస్తూ 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ను యూఏఈ మంత్రికి వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌పై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాసాలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే మారుబేని, సెమ్‌కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్నాయని, తాజాగా రిలయన్స్ గ్రూప్ వంతారాతో కలిసి ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు.
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు యూఏఈ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగేందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో కలిసి తెలంగాణ గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశాలపై కూడా చర్చించామని చెప్పారు.
ఈ కీలక సమావేశంలో తెలంగాణ తరఫున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దావోస్ వేదికగా జరిగిన ఈ భేటీ, తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలకు బలమైన పునాది వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications