ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్.. బీఆర్ఎస్ పై బీజేపీ మరో అస్త్రం!!
తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ పై పోరాటాన్ని ఉదృతం చేయడంలో బిజెపి మరో అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఓరుగల్లు నుండి నిరుద్యోగ మార్చ్ చేయడానికి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 15వ తేదీన ఓరుగల్లు వేదికగా బిఆర్ఎస్ పై సమరం చేయడానికి బిజెపి సిద్ధమవుతోంది. టిఎస్పిఎస్సి పేపర్ లీక్ పై ప్రధానంగా మూడు డిమాండ్లతో బిజెపి కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, అలాగే నష్టపోయిన నిరుద్యోగులకు లక్షరూపాయలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చెయ్యనుంది. ఈ మూడు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మరియు కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగులను చైతన్యవంతులను చేసి నిరుద్యోగ మార్చ్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

15న ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనే వారందరికీ నిరుద్యోగ బాధితుడు #30 పేరుతో కంకణాలు అందజేయాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఇక ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని బండి సంజయ్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. నిరుద్యోగుల బాధలను, ప్రభుత్వ వైఫల్యాలను నిరుద్యోగ మార్చ్ వేదికగా ఎండగట్టనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పోరాటం చేయడానికి బిజెపి నాయకులు సమాయత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్ ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ నేతలు బిఆర్ఎస్ ను మళ్లీ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో టార్గెట్ చేయబోతున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ తర్వాత మిలియన్ మార్చ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ ప్రయత్నంలో బిజెపి నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications