Surveys Opinion:తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఆ అదృశ్య శక్తి..!
ఈ రోజు సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఉందంటే అందుకు విత్తనం రెండు దశాబ్దాల క్రితం పడిందనే చెప్పాలి. అవును 1997లో సిక్స్ డిగ్రీస్ (sixdegrees.com) సైట్ ద్వారా సోషల్ మీడియా బజ్ క్రియేట్ అయ్యింది. ఇక అక్కడ నుంచి సోషల్ మీడియా వేగంగా అడుగులు వేయడం మొదలెట్టింది. వివిధ రకాల పేర్లతో సోషల్ మీడియా విస్తరించింది. నేడు సోషల్ మీడియా దైనందిత జీవితంలో ఓ భాగమైంది. ఎన్నో చర్చలకు వేదికగా నిలుస్తోంది. 60 పదాల చిన్న వార్త నుంచి గంటల తరబడి సాగే పాడ్ కాస్ట్‌వరకు సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. ఇంకా నికచ్చిగా చెప్పాలంటే రాజకీయాల్లో సామాజిక మాధ్యమం ముఖ్య పాత్ర పోషిస్తోంది.
ఇక దేశ రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక అస్త్రంగా మారింది. కంటెంట్ మార్కెటింగ్ నేటి రాజకీయాలకు చాలా అవసరమన్న విషయాన్ని పలు సర్వే సంస్థలు విస్మరిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాము చేసే సర్వేల్లో శాంపిల్స్ సేకరణ సంప్రదాయ పద్ధతిలోనే ఇంకా చేపడుతున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ సంస్థ వన్ ఇండియాతో కలిసి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పై సర్వేలు చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కంటెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని ఎప్పటికప్పడు పసిగడుతూ నివేదిక తయారు చేసింది. ఈ సర్వే సంస్థ కచ్చితత్వంతో కూడిన సంఖ్యను ఇవ్వడంతో చాలా మంది షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఆ సర్వే తేల్చిన అంశాలేంటి..

సెప్టెంబర్ 2023 నుంచి నెలకు 20 సీట్లు చొప్పున వెనుకంజలో బీఆర్ఎస్
ఈ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, 2023 సెప్టెంబర్ నెలలో తెలంగాణలోని 92 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి సేకరించి సమాచారం లేదా శాంపిల్స్ నాటి అధికారిక బీఆర్ఎస్‌కు అనకూలంగా వచ్చాయి.అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 71 నియోజకవర్గాలకు, నవంబర్‌లో 57 స్థానాలకు, డిసెంబర్ నెలలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరకు 30 స్థానాలకు గులాబీ పార్టీ పరిమితమైంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో తన క్యాంపెయిన్‌ను చాలా దూకుడుగా నిర్వహించింది. నవంబర్ నెలలో కాంగ్రెస్ ప్రచారం సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరింది.ఈ నివేదిక ప్రకారం రెండు సంఘటనలు అంటే ఓ వైపు బీఆర్ఎస్ నీరుగారిపోవడం మరోవైపు కాంగ్రెస్ పుంజుకోవడం ఒకేసారి జరిగాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.

కీలక నేతలపై ఆధారపడటం బీఆర్ఎస్‌ను ముంచింది
ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లపైనే ఆధారపడటం గులాబి పార్టీ పుట్టి మునిగిందనే విషయం తేటతెల్లమవుతోంది. బీఆర్ఎస్ జనరేట్ చేసిన బజ్‌ను చాలా నిశితంగా పరిశీలిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎంతలా అంటే ఈ ముగ్గురికి సంబంధించిన అంశాలే దాదాపుగా 88శాతం వరకు మీడియాలో కనిపించేవి. మరో 12శాతం పార్టీలోని మిగితా నేతలు కవర్ అయ్యేవారు.
అదే కాంగ్రెస్ పార్టీలో పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించి 70శాతం కవర్ అయ్యేలా హస్తం పార్టీ జాగ్రత్త పడగా మరో 30శాతం ఇతర నేతలు మీడియాలో కనిపించేవారు. పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైసీపీ ఘోర వైఫల్యానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. ఆ పార్టీ కూడా ఒకరిద్దరు నాయకులపై ఆధారపడటం వల్లే గెలుపు దూరమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాపై బీఆర్ఎస్ క్రియేట్ చేసిన హంగామా చూస్తే 60శాతం వరకు కేటీఆర్ హ్యాండిల్స్ నుంచే క్యాంపెయినింగ్ జరిగినట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ వ్యవహరించిన స్ట్రాటజీ ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడి సోషల్ హ్యాండిల్స్ ద్వారా అగ్రెసివ్ క్యాంపెయినింగ్ జరిగినట్లు కనిపిస్తోంది.

మేడిగడ్డ బ్యారేజ్‌కు బీటలు..బీఆర్ఎస్‌కు బీటలు
బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం వారి హయాంలో మేడిగడ్డ బ్యారేజ్‌కు బీటలు ఏర్పడి కుంగిపోవడం. దీన్నే తమ ప్రచారాస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, నాటి కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల పట్ల ఎంత ఉదాసీనతతో వ్యవహరించారో చెబుతూ సోషల్ మీడియాలో కంటెంట్‌ను క్రియేట్ చేయడం ద్వారా ప్రజలకు వివరించింది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, జాతీయ హోదా తీసుకురావడంలో విఫలం చెందడం, నిరుద్యోగ సమస్యలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ సోషల్ మీడియాలో కంటెంట్ జనరేట్ చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో కాంగ్రెస్ నేడు అధికారంలోకి రాగలిగిందన విషయం నివేదిక ద్వారా అర్థమవుతోంది. ఏ అంశాలను ఎంత శాతం ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్ల గలిగిందనే దానిపై ఒక సారి చూస్తే...
మేడిగడ్డ బ్యారేజ్ : 50.6%
కాళేశ్వరంకు జాతీయ హోదా : 14.1 శాతం
నిరుద్యోగం: 10.7 శాతం
డబుల్ బెడ్రూం వివాదాలు: 7.8 శాతం
దళితులకు మూడకరాల భూమి: 6.3 శాతం
నిరుద్యోగ భృతి: 4.3 శాతం
దళితబంధు పథంలో వివాదం: 2.5 శాతం
పోడు భూముల అంశం: 1.7 శాతం
ఇతర అంశాలు: 2.2 శాతం

మేనిఫెస్టోల పై యుద్ధం
ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఎన్నికల ప్రచారం చివరి అంకంలో చాలా కీలకంగా మారినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన రైతు బంధు పథకం పై ఆశలు పెట్టుకోగా, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలనే నమ్ముకుంది.అయితే కాంగ్రెస్ తన హ్యాండిల్స్ ద్వారా మేనిఫెస్టో పై సోషల్ మీడియాలో చేసిన క్యాంపెయిన్ లేదా పోస్టులు గులాబీ పార్టీకంటే 37శాతం తక్కువగానే ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అయితే కాంగ్రెస్ తన ఫోకస్ అంతా ఆరు గ్యారెంటీ పథకాలపైనే పెట్టగా బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకాన్ని సోషల్ మీడియాలో ప్రచారాస్త్రంగా మలుచుకుంది. రెండు పార్టీల మధ్య కంటెంట్ పరంగా సోషల్ మీడియాలో సాగిన పోరులో కాంగ్రెస్‌దే పైచేయిలా కనిపించింది.

పట్టణం ప్రాంతం వర్సెస్ గ్రామీణ ప్రాంతం
ఇక సోషల్ మీడియాలో ఇటు బీఆర్ఎస్ అట కాంగ్రెస్ పార్టీలు సృష్టించిన కంటెంట్‌ను జాగ్రత్తగా గమనిస్తే... గులాబీ పార్టీ జనరేట్ చేసిన కంటెంట్ ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలు అట్రాక్ట్ కాగా, కాంగ్రెస్ పార్టీ కంటెంట్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంది.అదే సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ చేరవేసిన కంటెంట్ ఇంగ్లీషు భాషలో ఉండటంతో అక్కడి ప్రజలు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడిస్తోంది.
మొత్తానికి ఈ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఒక రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే సోషల్ మీడియా పాత్ర ఎంత కీలకమో తెలుస్తోంది. అంతేకాదు విభిన్న పద్దతిలో కంటెంట్ క్రియేట్ చేయడం, సరైన ప్రణాళిక కలిగి ఆ కంటెంట్‌ను డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా అది అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతోందా లేదా అనేది సమీక్షించుకుని ఆ మేరకు వ్యూహాలను అమలు చేస్తే ఆయా పార్టీల గెలుపు వాకిట ముంగిట ఉంటుందనే అభిప్రాయం సోషల్ మీడియా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications