Union Budget 2023: కేంద్ర బడ్జెట్.. నిర్మలమ్మకు తెలంగాణా డిమాండ్లు ఇవే.. ఈ సారైనా..!!
2023- 2024కేంద్ర బడ్జెట్ ను రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో నిర్మలమ్మకు తెలంగాణా విభజన హామీలతో పాటు, అనేక డిమాండ్లను పెట్టింది.
2023- 2024 సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు రెండు ఉభయ సభలలోను బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పట్లానే కేంద్రానికి అనేక డిమాండ్లు వెల్లువగా మారాయి.

బడ్జెట్ వేళ.. కేంద్రానికి తెలంగాణా డిమాండ్లు ఇవే
కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తుందని పదేపదే ఆరోపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా కేంద్రం పెడుతున్న బడ్జెట్లో విభజన హామీలను నెరవేర్చాలని, ఆ దిశగా కేంద్ర బడ్జెట్ ఉండాలని కోరుతుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, నవోదయ, సైనిక్ స్కూల్ లను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ములుగు జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేటాయింపులు చెయ్యాలని, తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులైన కాలేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులలో, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.

ఉద్యోగాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేసి సీట్ల సంఖ్యను పెంచాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం తెలంగాణకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు చేనేత పై జిఎస్టి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టనున్న ప్రాజెక్టులకు కేంద్రం వాటాగా 7,778 కోట్ల రూపాయలు ఇవ్వాలని, వరంగల్లో చేపట్టే మెట్రోనియో ప్రాజెక్టుకు 20% వాటాగా 184 కోట్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది.

వైద్య కళాశాలలు, విమానశ్రాయాల ఏర్పాటు.. రైతుల కోసం డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్ పెంచాలని, తెలంగాణ రాష్ట్రానికి వైద్య కళాశాలలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది. వ్యవసాయ దిగుబడులకు మద్దతు ధర ప్రకటించాలని, అందుకోసం కేంద్రం విశ్వసనీయమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

బల్క్ డ్రగ్ పార్క్ .. పారిశ్రామిక కారిడార్ లపై డిమాండ్లు
ఉడాన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని, పత్తి జిన్నింగుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలు సడలించి, పాత పద్ధతిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ ను బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో చేర్చాలని, హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్ - నాగపూర్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ ఔషధ నగరి జహీరాబాద్లను కలిపేందుకు ఖర్చయ్యే 5000 కోట్లలో కనీసం 50% నిధులైన కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇవి తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన వాటిగా డిమాండ్ చేస్తున్నవి మచ్చుకు కొన్ని మాత్రమే.

తెలంగాణాకు ఈసారి మొండి చెయ్యేనా? అందరిలో ఒకటే చర్చ
తెలంగాణ రాష్ట్రానికి ప్రతిసారి మొండి చేయి చూపిస్తున్నట్టుగా, ఈసారి కూడా మొండి చెయ్యి చూపిస్తారు అన్న భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉండగా, మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఏ విధంగా ఉండబోతాయి అన్నది మాత్రం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులపై మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇక తెలంగాణా సమాజంలోనూ బడ్జెట్ సమావేశాలపై, తెలంగాణాకు ఏమి ఇస్తారు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications