యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ఆందోళనలకు పిలుపు!
తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన నిలుస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తహసిల్దార్లకు బీజేపీ శ్రేణులు వినతి పత్రాలివ్వాలి
రేపు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కార్యాలయాలకు వెళ్లి తహసిల్దార్లకు బీజేపీ శ్రేణులు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం బాధాకరం అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేకుండా పోయింది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదు
రాష్ట్రవ్యాప్తంగా 7,572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వాటిలో ఇప్పటికే 4598 కొనుగోలు కేంద్రాలను కూడా తెరిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు.
పలు జిల్లాల్లో వర్షం వలన తడిసిన వడ్లు
వడ్ల కుప్పలతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోవడంతో... స్థలం లేక వడ్లను తీసుకొచ్చిన రైతులు రోడ్లపై రాశులుగా పోస్తున్నారన్నారు. దీంతో వాహన దారులకు ఇబ్బందులు కలగడం తో పాటుగత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలవల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడ్లు తడిసిపోయాయన్నారు. చాలా చోట్ల కోతకు వచ్చిన పంట వర్షాలవల్ల నీళ్లపాలైందని ఆయన పేర్కొన్నారు.
వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని చొప్పదండి, సిరిసిల్ల మానకొండూరు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో వడ్లు తడిసిపోయాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు సైతం తడిసిపోవడంతో ఎక్కడ చూసినా ఎండబెట్టుకున్న దృశ్యాలే కన్పిస్తున్నాయాన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని మెలిక పెట్టడం సరి కాదు
ఎన్నికల్లో ఇఛ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోసన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని మెలిక పెట్టడం సమంజసం కాదన్నారు . అన్ని రకాల వడ్లకు కూడా బోనస్ చెల్లించి ఎన్నికల హామీని నెలబెట్టుకోవాలని కోరుతున్నట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications