ఇస్తేనే మేం సాయం చేస్తాం, లేకుంటే ఏం చేయలేం: తెలంగాణపై కేంద్రమంత్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కరవు పైన నివేదిక ఇస్తేనే మేం సాయం చేయగలమని, లేకుంటే ఏం చేయలేమని కేంద్రమంత్రి కుందారియా గురువారం అభిప్రాయపడ్డారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.
కరవు పైన తెలంగాణ ప్రభుత్వం నివేదికలు అందలేదని చెప్పారు. నివేదిక అందితే లేదా ఇస్తేనే సాయం చేయగలమని స్పష్టం చేశారు. జిల్లా వారిగా వివరాలు పంపిస్తే కేంద్ర బృందాలు పరిశీలనకు వస్తాయని వెల్లడించారు.
పత్తి రైతులకు మద్దతు ధర పెంచాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రాన్ని కోరిందని చెప్పారు. తెలంగాణలో యాభై మంది సిసిఐ ఆధికారులను కేటాయించాసమన్నారు. తేమగా ఉన్నప్పటికీ పత్తి కొనాలని ఆదేశించామన్నారు. నేను లేదా సిసిఐ చైర్మన్ త్వరలో పర్యటిస్తామన్నారు.

పత్తికి మద్దతు ధరకు కేంద్రానికి లేఖ రాశాం: ఈటెల
పత్తికి మద్దతు ధర ఇచ్చేది కేంద్రమేనని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పారు. మార్కెట్లో దళారీ వ్యవస్థను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.
వాహనాల నెంబర్ ప్లేట్ల మార్పుపై ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చుకునేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీకి బదులు టీఎస్‌గా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నెంబర్ ప్లేట్లు మార్చుకోవడానికి నాలుగు నెలల గడువు విధించింది. జిల్లాల కోడ్‌లు కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్ని జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications