తెలంగాణాకు గాల్లో తేలిపోయే శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తెలంగాణా రాష్ట్రానికి విమానాశ్రయాల విషయంలో శుభవార్త చెప్పారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు. నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి తెలంగాణాలో నాలుగు విమానాశ్రయాలు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణా సీఎం, మంత్రుల బృందం
తెలంగాణా రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని వారు కోరారు. వరంగల్ తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం అదిలాబాద్ లో విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని తెలిపారు. సెకండ్ టైర్ పట్టణాలలో విమానాశ్రయాల ఏర్పాటు అవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్ళారు.

స్పందించిన ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇక తెలంగాణా సీఎంతో పాటు మంత్రుల బృందం భేటీపైన మాట్లాడుతూ తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణంపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ విమానాశ్రయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా పనులు చేస్తుందని, ఇప్పటికే భూసేకరణకు సర్క్యులర్ సైతం జారీ చేసిందని ఆయన తెలిపారు.
వరంగల్ విమానాశ్రయంపై కీలక ప్రకటన
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్‌లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.వరంగల్‌తోపాటు మరో మూడు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తమను కోరారని పేర్కొన్నారు.
పెద్దపల్లి, కొత్తగూడెం విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్రమంత్రి
ఇక పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో సాధ్యాసాధ్యాలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే ఆపై భూసేకరణకు వెళ్లవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఆ శాఖ నుంచి అనుమతి వస్తే ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుపై ఆ హామీ
ఆదిలాబాద్‌కు ఓ వైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్రలు సరిహద్దులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ దరిదాపుల్లో విమానాశ్రయం లేదని గుర్తు చేశారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనిపై రక్షణ శాఖ మంత్రిత్వ శాఖతో మాట్లాడతామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications