యూపీఎస్సీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు: ఏపీ, తెలంగాణ నుంచి వీరే
హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్(civils)-2022 తుది ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్ ఆలిండియా తొలి ర్యాంకు సాధించగా, గరిమ లోహియా(బీహార్) రెండో ర్యాంక్ సాధించింది.
తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు. మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి.. నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం గమనార్హం. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్. ఇక యూపీకి చెందిన స్మృతి మిశ్రా(యూపీ) నాలుగో ర్యాంక్ సాధించారు.

2022 ఏడాదికి గానూ మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టులవారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ కేటగిరిలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా సత్తా చాటారు.
ఈసారి సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఈసారి కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు. నూకల ఉమా భారతి మూడో ర్యాంక్ సాధించగా.. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.

హెచ్ఎస్ భావనకు 55, సాయి ప్రణవ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రామ్‌దేని సాయినాథ్ 742, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించారు. కాగా, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది.












Click it and Unblock the Notifications