అమెరికాలో రూ.620 కోట్ల మోసం చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాడు..హైదరాబాద్ లో రంగంలోకి ప్రత్యేకబృందాలు
ఇండియా నుండి అమెరికా వెళ్ళిన వాళ్ళు చదువుకోవటానికి, ఉద్యోగాల కోసం నానా పాట్లు పడుతుంటే, అమెరికా ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి వచ్చి హైదరాబాద్ లో మకాం వేసిన కేటుగాళ్ళు కూడా ఉన్నారు. రూపాయి, రెండు రూపాయలు కాదు ఏకంగా వందల కోట్లకు అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనుడు హైదరాబాద్ నగరంలో ఉన్నాడన్న వార్త ఇప్పుడు నగర పోలీసులను చేరింది.
అమెరికాలో మెడికేర్ పథకాన్ని దుర్వినియోగం చేసి భారీ మోసానికి పాల్పడిన నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. మహ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ వ్యక్తి టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో జన్యు పరీక్షల ల్యాబొరేటరీ నిర్వహించేవాడు.2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్యకాలంలో అతడు సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించినట్లు దర్యాప్తులో తేలింది.

వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు దాదాపు మన కరెన్సీలో రూ.620 కోట్లు అక్రమంగా వసూలు చేశాడు. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి అవసరం లేని జన్యు పరీక్షల కోసం బిల్లులు పెట్టినట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ మోసం బయటపడిన తర్వాత అతడి బ్యాంకు ఖాతాల్లోని కొంత సొమ్మును ఫ్రీజ్ చేశారు.
టెక్సాస్ అధికారులు అతన్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. దీంతో అక్కడ పోలీసుల కళ్ళు గప్పి, ఇమిగ్రేషన్ అధికారులకు దొరకకుండా అతను ఇండియాకు వచ్చినట్టు సమాచారం. అమెరికా నుంచి పారిపోయిన అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు ఇక్కడి పోలీసులకు సమాచారం అమెరికన్ పోలీసులు అందించారు.
దీంతో హైదరాబాద్ నగర పోలీసులు రంగంలోకి దిగారు. శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చిన ప్రయాణికుల జాబితాలను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు అమెరికన్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ కోసం గాలింపు చేపట్టాయి. అతడిని పట్టుకుంటే అమెరికాకు అప్పగించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
