వైకుంఠ ఏకాదశి... భక్తులతో పోటెత్తిన యాదగిరి, స్వర్ణగిరి ఆలయాలు!
తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని విష్ణుమూర్తిని దర్శించి భక్తులు ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల దగ్గర బారులు తీరారు.
యాదగిరి గుట్టలో ఉత్తర ద్వార దర్శనం
శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఈరోజు యాదగిరిగుట్టలో ఉదయం నుంచే యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. నేడు గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో 5 గంటల 28నిమిషాలకు ప్రధాన అయ్యే ఉత్తరద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు.

స్వర్ణగిరి ఆలయంలో పోటెత్తిన భక్తులు
స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజనం కిటకిటలాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తులతో జాతీయ రహదారిపైన ట్రాఫిక్ జామ్ నెలకొంది.
వరంగల్ జిల్లాలో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు
వరంగల్, హనుమకొండ జిల్లాలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రముఖ ఆలయాలలో ఘనంగా జరుగుతున్నాయి. నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్లోని బట్టల బజార్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో, హనుమకొండ లోని రెవెన్యూ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, చారిత్రక పద్మాక్షి, భద్రకాళి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గోవింద నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు
వెంకటేశ్వర స్వామి ఆలయాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా గోవింద నామస్మరణతో ప్రముఖ ఆలయాలన్నీ మార్మోగిపోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలలోనూ, ముఖ్యంగా వైష్ణవాలయాలలో నేడు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. ఇక వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications