వందేభారత్ రైళ్ళలో ప్రయాణిస్తున్న వారిలో వారే అధికం!!
భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ రైళ్ళు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునికతకు పట్టం కడుతూ రైల్వే ముఖచిత్రాన్ని మార్చాయి అని చెప్పొచ్చు. హై స్పీడ్ తో, అత్యాధునిక వసతులతో ప్రయాణం చేయాలి అనుకునే వారికి వందే భారత్ ఒక సరైన ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ళు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఈ రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల మధ్య ప్రస్తుతం వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఆధునిక డిజైన్, అగ్రశ్రేణి సౌకర్యాలతో, హై స్పీడ్ తో, సమర్థవంతమైన సేవలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 100 శాతానికి పైగా ఆదరణతో విజయవంతంగా నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ విశాఖపట్నం, సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్, కాచిగూడ యశ్వంతపూర్, విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ల మధ్య వందే భారత్ రైళ్ళు నడుస్తున్నాయి. అయితే వందే భారత్ రైళ్ల ధర ఎక్కువైనప్పటికీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు అన్న కారణంగా ఈ రైళ్లకు మంచి ఆదరణ పెరిగింది.
ముఖ్యంగా వందే భారత్ రైళ్లను ఎక్కుతున్న వారిలో యువతే ఉండడం ఆసక్తికరమైన అంశం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఏకంగా 56 శాతం మంది యువకులు ప్రయాణిస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే తేల్చింది. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతో, పాటు అత్యాధునిక వసతులు ఉండడంతో యువత ఈ రైళ్ళ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది.
యువత తర్వాత వందే భారత్ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారి విషయానికి వస్తే 60 సంవత్సరాలకు పైబడిన వారు వీటిలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సగటున 29.9 శాతం మంది 25 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్న వారే కావడం విశేషం.












Click it and Unblock the Notifications