యాదగిరిగుట్ట అభివృద్ధికి రాజు వెగేస్నా రూ. 5కోట్ల విరాళం(ఫొటోలు)
హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు రాజు వెగేస్నా ఫౌండేషన్ ముందుకొచ్చింది. యాదగిరిగుట్టలో అన్న ప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణానికి, రక్షిత మంచినీటి ప్లాంట్ నిర్మాణానికి రూ. 5 కోట్ల విరాళం అందించింది.
ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి రాజు వెగేస్నా, ట్రస్టీలు ఆనంద్‌రాజు, రాజేశ్ తిరుమలరాజు, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌లు ఆదివారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. రూ. 5 కోట్లతో అన్నప్రసాదం కాంప్లెక్స్, వాటర్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామంటూ హామీ పత్రాన్ని సీఎంకు అందించారు.

యాదగిరిగుట్టతోపాటు ధర్మపురి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొమురవెల్లి, బంజారాహిల్స్, కాళేశ్వరం, మహేశ్వరం పిరమిడ్, వరంగల్ భద్రకాళి, జమలాపురం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ దేవాలయాల్లో మంచినీటి శుద్ధి ప్లాంట్లు పెట్టడానికి ఫౌండేషన్ ముందుకువచ్చింది.
హైదరాబాద్‌లోని ఎండోమెంట్ భవన్, ఉస్మానియా యూనివర్సిటీ, చంచల్‌గూడ జైలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లు, పోలీసు మెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, సీఐడీ ఆఫీసు, పోలీస్ బెటాలియన్స్‌లో కూడా వాటర్‌ప్లాంట్లు పెట్టనున్నట్టు వారు చెప్పారు.

కాగా, ఈ ఫౌండేషన్ ఇప్పటికే రూ. 21 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన సత్రం, రూ. 5 కోట్ల వ్యయంతో టీటీడీలో జలప్రసాదం, ద్వారకా తిరుమలలో హాస్పిటల్‌ను రూ. 15 కోట్లతో ఏర్పాటుచేసింది.












Click it and Unblock the Notifications