కలర్‌ఫుల్‌గా ఎన్టీఆర్ స్టేడియం: సాంస్కృతిక జాతర: శంకర్ మహదేవన్, తమన్ మ్యూజికల్ ఈవెంట్స్
హైదరాబాద్: హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియం కలర్‌పుల్‌గా మారింది. జాతరను తలపిస్తోంది. మూడు రోజుల పాటు సాగే రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ ఇక్కడ ఏర్పాటైంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ, ఏపీలకు చెందిన 550 మంది కళాకారులతో పాటు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన చేతివృత్తిదారులు తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు.

ప్రారంభించిన ఉప రాష్ట్రపతి..
ఈ ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాప్ మ్యూజికల్ డైరెక్టర్స్ శంకర్ మహదేవన్-ఎహ్‌సాన్-లాయ్, ఎస్ఎస్ తమన్, ప్రఖ్యాత బాలీవుడ్ గాయని కవిత కృష్ణమూర్తి, డాక్టర్ ఎల్ సుబ్రమణియం మ్యూజికల్ ప్రోగ్రామ్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆనంద్ శంకర్ జయంత్ నృత్య ప్రదర్శన ఉంటుంది.

చేతివృత్తులనున కాపాడుకోవాలి..
ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మన శిల్పులు, చేతివృత్తి కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని, వారిని మరింత ప్రోత్సహించాలని సూచించారు. కళలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఈ బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. వివిధ రకాల భారతీయ కళలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు.

భిన్న సంస్కృతులపై అవగాహన..
విద్యతో పాటు కళల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ మాట్లాడారు. భిన్నసంస్కృతులపై అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. భిన్న ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులను తెలుసుకోవాలని చెప్పారు. భారత్.. ఎన్నో భిన్న సంస్కృతులకు ఆలవాలమని, ఇలాంటి భిన్నత్వం మరెక్కడా కనిపించదని పేర్కొన్నారు.

కరోనా వల్ల నిర్వహించుకోలేకపోయాం..
కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ- కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల గత రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ వంటి కార్యక్రమాలను నిర్వహించుకోలేకపోయామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక్కటే అతిపెద్ద ఈవెంట్‌గా ఆయన అభివర్ణించారు. ప్రధాని ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

కళాకారులకు ప్రోత్సాహం..
గిరిజనులు, ఆదివాసీలు, చేతివృత్తిదారులు, హస్తకళాకారులను ప్రోత్సహించేలా కేంద్రంలోని తమ ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, అమర గాయకులు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకాలకు గుర్తుగా వారి కలెక్షన్లను ఈ ఈవెంట్ సందర్భంగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications