తీర్పు చెప్పలేం, మాల్యా హాజరు తప్పనిసరి: జీఎమ్మార్ కేసులో కోర్టు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్యాంకుల నుంచి 9వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా చెక్‌బౌన్స్ కేసును ఎర్రమంజిల్ మూడో ప్రత్యేక న్యాయస్థానం సోమవారం విచారించింది.
ఈ కేసులో నిందితుడు హాజరుకాకుండా తీర్పు వెల్లడించలేమని స్పష్టం చేసింది. జీఎంఆర్ యాజమాన్యం దాఖలు చేసిన చెల్లని చెక్కుల కేసులో మూడో ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్ జస్టిస్ కృష్ణారావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
కేసు తదుపరి విచారణను మే 25వ తేదీకి వాయిదా వేశారు. హైదరాబాద్‌లో జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు కింగ్‌ఫిషర్ సంస్థ రూ.25కోట్లకు పైబడి బకాయి పడింది. రాజీ తర్వాత రూ.22కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ యాజమాన్యం అంగీకరించింది.

ఆ మొత్తానికి 45 చెక్కులు జీఎంఆర్‌కు అందజేసింది. కాగా, బ్యాంకుల్లో తగిన డబ్బు నిల్వ లేకపోవడంతో ఆ చెక్కులు చెల్లలేదు. దీంతో జీఎంఆర్ సంస్థ 17 కేసులు పెట్టింది. ఇందులో రూ.50లక్షల వంతున రెండు చెక్కులకు సంబంధించిన కేసులో మాల్యాను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
కాగా, ప్రస్తుతం మాల్యా లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించేందుకు జీఎమ్మార్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications