ప్రగతి భవన్‌లో ఘనంగా విజయ దశమి వేడుకలు: కుటుంబంతో కలిసి కేసీఆర్ పూజలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో విజయ దశమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు దసరా శుభకాంక్షలు తెలిపారు. కాగా, విజయదశమి (Vijaya dashami) వేడుకలు సోమవారం ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.

ఈ సందర్భంగా.. శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరకీ సీఎం కేసీఆర్ దసరా (dussehra) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

కేటీఆర్ దసరా శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విజయదశమి స్ఫూర్తితో మీరు చేసే మంచి పనులన్నింటిలో విజయం కలగాలని ఆశిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications