కేసీఆర్.. ముందు నువ్వు వ్యాక్సిన్ తీసుకో.. తెలంగాణా వ్యాక్సినేషన్ పై విజయశాంతి ఫైర్
మాజీ ఎంపీ, బిజెపి మహిళా నేత విజయశాంతి తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఈరోజు విజయశాంతి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శించారు. అక్కడ కరోనా వ్యాక్సినేషన్ తీరుతెన్నులు గమనించటానికి వచ్చానని చెప్పిన విజయశాంతి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో, అక్కడి సిబ్బంది తో నేరుగా మాట్లాడిన విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ తాను కూడా బాధ్యతగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. సిరంజీలు ప్రజలు స్వయంగా తెచ్చుకోవాలని వ్యాక్సిన్ సిబ్బంది చెప్పడం సరికాదని విజయశాంతి పేర్కొన్నారు. ఇక సిరంజీలు కూడా ప్రజలే తెచ్చుకుంటే ప్రభుత్వం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలని ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదని ఆమె పేర్కొన్నారు. కెసిఆర్ బాధ్యతారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. కరోనా వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి అని చెబుతున్న కేసీఆర్, తనకు కరోనా వస్తే యశోద ఆసుపత్రిలో ఎందుకు చేరినట్లు అంటూ నిలదీశారు. కరోనా సోకినప్పుడు సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెప్పకుండా బహిరంగ సభలో కరోనావైరస్ పై బాధ్యతారహితంగా మాట్లాడారని రాములమ్మ విమర్శించారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తున్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇప్పించాలని, అన్ని మౌలిక సదుపాయాలను ఆసుపత్రులలో, వ్యాక్సిన్ కేంద్రాలలో కల్పించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications