బీజేపీకి భారీ షాక్: విజయశాంతి రాజీనామా, కాంగ్రెస్‌లోకి ఎప్పుడంటే?
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంిపంచారు. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో విజయశాంతి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.
గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీ వీడతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా, చివరకు బీజేపీకా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం దక్కడం లేదనే అభిప్రాయంలో విజయశాంతి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయడం గమనార్హం.
తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు: విజయశాంతి
తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుండి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంతమాత్రం సరికాదు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నది.
అట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవం, పార్టీల ప్రయోజనాలు వేరు... ప్రజా ప్రయోజనాలు వేరు. ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి. అందుకే, కోవిడ్ కష్టకాలంలో, ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్‌లల్ల వస్తున్న ఆంధ్ర ప్రాంత వైద్య అవసర బాధితులు హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రాకుండా, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలియక పోలీసులు అడ్డుకున్న నాడు, వారిని తక్షణం వదలకుంటే, ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని చెప్పినది రాములమ్మేనన్న జ్ఞాపకం ఇప్పటికీ అందరికీ సజీవమే... అని విజయశాంతి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications