గేట్లేత్తేసిన రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్‌కు పట్నం సునీత రాజీనామా: బిగ్ వికెట్స్
Revanth Reddy: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటోన్నారు.
ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య పట్నం సునీతరెడ్డి, మాజీ శాసన సభ్యుడు తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన భార్య బొంతు శ్రీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు పంపించారు.
ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా తనకు అవకాశాలను కల్పించింనందుకు కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నట్లు సునీత రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరదలచుకున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ.. తన అభిరుచికి దగ్గరగా ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications