Ganesh chaturthi: పర్యావరణ హితం.. మట్టి గణపతికే జై..!
వినాయక చవితి పండగ వచ్చేస్తోంది. ఆగస్టు 27 నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 6 వరకు దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగను ప్రతి ఏటా అత్యంత కోలాహలంగా జరుపుకొంటారు. గణపతి నవ రాత్రులు వచ్చాయంటే ప్రతి గల్లీ గణపతి విగ్రహాలతో నిండిపోతుంది. అయితే ఏటేటా మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ తో తయారు చేసే విగ్రహాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాల వాడకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రజల్లో మట్టి విగ్రహాలపై అవగాహన పెరిగింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర రసాయనాల కారణంగా ఆ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీటి కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మట్టి వినాయకులకే ప్రజలు ఆదరణ చూపుతున్నారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం 4 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేసేందుకు జీహెచ్ ఎంసీ కసరత్తు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గ్రేటర్ లో 150 వార్డులుండగా.. వార్డుకు 2,500 నుంచి 3 వేల చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టనుంది.

మరోవైపు గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా నిర్వహించుకోవాలని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేందుకు జీహెచ్ ఎంసీ, పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖలు సహకారం అందిస్తాయని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. అలాగే నిమజ్జన కార్యక్రమం సజావుగా, వేగంగా జరిగేలా గత సంవత్సరం కంటే ఈ సారి ఎక్కువ క్రేన్ లను వినియోగిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications