రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని విడదీస్తున్నారు: కేకేపై కుమారుడు విప్లవ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు పార్టీ మారుతుండటంపై ఆయన తనయుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ వయస్సులో కేశవరావు పార్టీ మారడం ఏమిటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తండ్రి పార్టీని వీడటం బాధగా ఉందన్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా తన తండ్రి కేసీఆర్‌కు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం సరికాదన్నారు. అయితే, తన తండ్రి పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లుగా తాను భావించడం లేదన్నారు. ఈ వయస్సులో ఆయనకు పదవులు... పోస్టులు అవసరం లేదన్నారు. కేకే తన జీవితంలో ఎన్నో పదవులను అనుభవించారని తెలిపారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి కేకే అవసరం ఉందని విప్లవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో కేసీఆర్‌కు సలహాదారుడిగా ఉండి.. బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సిందన్నారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు ఈ వయసులో పార్టీ మారడమేంటని ఆయన గురించి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడారని.. ఇప్పుడు కేశవరావును ఎలా పార్టీలోకి పిలిచారని ప్రశ్నించారు.
ఇన్నేళ్లు ఒకే పార్టీలో తామంతా సంతోషంగా ఉన్నామని.. కానీ ఇప్పుడు తమ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి విభజించాలని చూస్తున్నారని విప్లవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పార్టీ మారే ఆలోచనపై పునరాలోచన చేయాలని కేశవరావును విప్లవ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని కోరారు. ప్రస్తుతం పార్టీకి మీరు కావాలని.. మీకు పార్టీ కావాలని కేకేకు సూచించారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీఆర్‌ఎస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారని విప్లవ్ కుమార్ గుర్తు చేశారు. 2016, 2021లో కార్పొరేటర్‌గా ఎంపికయ్యారని.. పార్టీ అధినేత కేసీఆర్ ఆమెను జీహెచ్‌ఎంసీ మేయర్‌ను చేశారన్నారు. పార్టీ మనకు ఎంత చేసినప్పుడు మనం పార్టీతోనే ఉండటం సమంజసమని అన్నారు. ఆత్మగౌరవం ఉంటే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని విప్లవ్ కుమార్ డిమాండ్ చేశారు.
మరోవైపు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నమ్మదగిన మనిషి కాదన్నారు విప్లవ్ కుమార్. ఆయన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు తండ్రి కంటే ఎక్కువ.. ఆయన కోసం ఏమైనా త్యాగం చేస్తా అని మాట్లాడిన దానం నాగేందర్.. ఇప్పుడు పార్టీ మారారని ఎద్దేవా చేశారు. పార్టీని వదిలి వెళ్లే వాళ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎట్టి పరిస్థితిల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications