Ashwini dutt: ఎట్టకేలకు తెలంగాణ విరాళం ప్రకటించిన అశ్వినీదత్.. అయినా అన్యాయమే..!
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు, ఏపీలోని విజయవాడ భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రజలకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ కదిలొచ్చింది. పలువురు సినీ ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున కోటీ రూపాయలు ఇచ్చారు. రామ్ చరణ్ కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున రూ.1 కోటి ఇచ్చారు. నటుడు సోను సూద్ ఏపీ, తెలంగాణకు కోటి చొప్పున రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఏపీ తెలంగాణకు కోటి చొప్పున రెండు కోట్ల విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ఇచ్చారు. కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు ఇచ్చారు. మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ఇచ్చారు.బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కోటీ రూపాయలు ప్రకటించారు. త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 25 లక్షల చొప్పున ఇచ్చారు. సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు ప్రకటించారు.
విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు ఇచ్చారు. వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.20 లక్షలు ఇచ్చారు. అశ్వనీదత్ మొదట ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 25 ప్రకటించారు. తెలంగాణకు రూపాయి కూడా ప్రకటించలేదు. దీంతో సోషల్ మీడియాలో అశ్వినీదత్ ను ఏకిపారేశారు. మీ సినిమాలు ఏపీ వారే చూస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోరా అని నిలదీశారు.
దీనిపై వన్ ఇండియా కూడా కథనం రాసింది. దీంతో అశ్వినీదత్ స్పందించి తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. అయితే ఏపీ కంటే రూ.5 లక్షల తక్కువగానే విరాళం ప్రకటించారు. దీనిపై కూడా నెటిజన్లు అశ్వినీదత్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా ఎందుకీ తేడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏకమైనప్పటికీ తెలుగు ప్రజలను ఆదుకోవడానికి టాలీవుడ్ ముందుకు రావడం గొప్ప విషయమే..!












Click it and Unblock the Notifications