మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కారు: ప్రీతి చెల్లెలుకు ప్రభుత్వ ఉద్యోగం, ఉత్తర్వులు
హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి చెల్లెలు పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎం ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే హెచ్ఎండీఏలో ఉద్యోగం ఇస్తూ.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఐటీ సెల్‌లో ఒప్పంద విధానంలో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రీతి మరణం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉన్నామన్న ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మనసున్న మహారాజులని, మాట ఇస్తే తప్పరని వ్యాఖ్యానించారు.

సీనియర్ సైఫ్ వేధింపులతో.. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి మృతి చెందింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రీతి కేసు హత్యనా? ఆత్మహత్యనా అనేది స్పష్టత రాలేదు. వరంగల్ సీపీ రంగనాథ్ ఆమెది ఆత్మహత్యే అని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. అయితే, సైఫ్.. ప్రీతిని హత్య చేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అనుమానాలపై తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి.. విచారణను చేపట్టింది.
ఈ విచారణలో ప్రీతి మృతిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాప్యంపై స్పందన తెలపాలని సీఎస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, వరంగల్ సీపీ, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అనస్థీషియా విభాగం అధిపతికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications