వాహనదారులకు హెచ్చరిక.. ఆ పనిచేస్తే క్రిమినల్ కేసులు, లైసెన్స్ రద్దు!
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులకు చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీసులు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విపరీతమైన ధ్వనులతో సైలెన్సర్ లు మార్చి వాహనాలు నడుపుతున్న వాహనదారులపైన ఫోకస్ చేసిన ట్రాఫిక్ పోలీసులు వాహనానికి ఒరిజినల్ గా వచ్చిన సైలెన్సర్ కాకుండా, వేరే సైలెన్స్ అమరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వాహనదారుడిపైన, వాహనానికి సైలెన్సర్ మార్చిన మెకానిక్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం
ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి ప్రభాకర్ రావు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు నేడు కేయుసి జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేసారు.

సైలెన్సర్ ల తొలగింపు, జరిమానా
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వాహనాలను గుర్తించి, ఆ సైలెన్సర్ లను తొలగించారు. గత మూడు నెలల కాలంలో ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో మార్పు చేసిన సైలెన్సర్లను తొలగించి, వాహన దారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు.
311కు పైగా సైలెన్సర్ల ధ్వంసం
ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో 311కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ద్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 275 కాగా కాజీపేట 111 వరంగల్ 75 వున్నాయి. ఇక సైలెన్సర్ లు మార్చడం పైన ట్రాఫిక్ అడిషనల్ డిసిపి ప్రభాకర్ రావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమన్నారు.

అలా చేస్తే మూడు నెలలు లైసెన్స్ రద్దు, వాహనం సీజ్
శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు, ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేస్తున్నామన్నారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని, ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసే వారిపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోబడటంతో పాటు ఆర్.టి.ఐ ద్వారా 03 నెలలు ఆ వాహనదారుడు లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందన్నారు. వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మెకానిక్ లకు వార్నింగ్
అలాగే తమ మెకానిక్ లు కూడా ఎట్టి పరిస్థితిలో ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని, ఇకపైన సైలెన్సర్ల మార్పుకు సహకరించిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ తెలియజేసారు.












Click it and Unblock the Notifications