మా జోలికి రాకుండా ఉంటే సహకరిస్తాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక పార్టీ ప్రతిపాదన?
నవంబరు 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉప ఎన్నిక, 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. భారత రాష్ట్ర సమితి తరఫున ఇటీవలే మృతిచెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్ పోటీచేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి పేర్లను అధిష్టానానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చే పేరు చివరగా ఖరారవుతుంది. భారతీయ జనతాపార్టీ పోటీచేస్తుందా? లేదా? అనే విషయం తేలలేదు. ఆ పార్టీ నిరాసక్తతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
మజ్లిస్ ఓట్లు బదిలీ చేయిస్తుందా?
జూబ్లీహిల్స్ లో మజ్లిస్ పార్టీ పోటీచేయడంలేదు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వారు ఎటు వేస్తే అటువైపు అభ్యర్థి గెలుపు ఖాయమవుతుంది. అయితే పాతబస్తీలో మా జోలికి రాకుండా ఉంటే ఇక్కడ మద్దతిస్తామని మజ్లిస్ ప్రతిపాదించినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం మజ్లిస్ తమ మిత్రపక్షమని ప్రకటించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మజ్లిస్ ను మిత్రపక్షంగా ప్రకటించుకుంటాయి. ఆ వర్గం ఓట్లను ఎంతవరకు బదిలీ చేయించగలదు అనే అంశంపైనే జూబ్లీహిల్స్ అభ్యర్థి విజయం ఆధారపడివుంటుంది.

నాలుగు పేర్లు పంపించిన రేవంత్
2014 ఎన్నికల్లో మజ్లిస్ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు పోటీచేయడంలేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లలో ఒకటి ఖరారు కానుంది. బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్ కు సహకరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ఎక్స్ లో పోస్ట్ చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ సునీతా గోపీనాథ్ కు పడతాయని బీఆర్ఎస్ ఆశపడుతోంది. ఆ పార్టీ కూడా లోపాయికారీగా మజ్లిస్ సహకారాన్ని కోరుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కొంతకాలం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చురుగ్గా లేదు. లేదంటే ఆ పార్టీ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారేవారు. ఇటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఎవరి మధ్య ప్రధాన పోరు జరుగుతుందనే విషయం మరో రెండురోజుల్లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications