తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 14నే నిర్ణయం
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తెలిపింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషన్ పేర్కొంది. ఆగస్టు 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు.
ఆగస్టు నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు గిరిధర్ రావు, నర్సింగ్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు చాలా ముఖ్యమైనవి. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని జూన్‌లోనే వినతిపత్రం ఇచ్చినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ స్పందించలేదు. నియామక పరీక్ష నిర్వహణ ప్రధాన ఉద్దేశం నెరవేరేలా కమిషన్ వ్యవహరించడం లేదు అని కోర్టుకు వివరించారు.

ఇది ఇలావుంటే, గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది రాంగోపాల్ రావు కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని, ఆ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని చెప్పారు. గ్రూప్-2కి ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. అయితే, వీరిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది కేవలం సుమారు 60వేల మంది అభ్యర్థులేనని తెలిపారు.
ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. గురుకుల పరీక్షలు రాస్తున్నది కొంతమంది అభ్యర్థులే అయినా.. వారికీ అవకాశం ఉండాలి కదా అని ప్రశ్నించింది. లక్షల మంది దరఖాస్తుదారుల్లో పిటిషన్ వేసింది 150 మందేనని టీఎస్‌పీఎస్సీ తెలుపగా.. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై నిర్ణయం ఆగస్టు 16వ తేదీలోపు చెబుతామని కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నందున ఆగస్టు 14నే చెప్పాలని జడ్జీ ఆదేశించారు. దీంతో 14నే పరీక్ష వాయిదాపై తమ నిర్ణయం చెబుతామని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు. కాగా, గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ టీఎస్ పీఎస్సీ కార్యాలయం ఎదుట గురువారం భారీ ఎత్తున అభ్యర్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications