సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారు: మోడీ, కేసీఆర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
పెద్దపల్లి: తెలంగాణ పర్యనటలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. పెద్దపల్లిలో జరిగిన విజయభేరీ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కేసీఆర్, మోడీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని అన్నారు రాహుల్. కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పుకొచ్చారు. సింగరేణి ప్రైవేటు పరం కాకుండా కాపాడుతామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు. తెలంగాణకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు రాహుల్. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేర్చారా? అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కేసీఆర్ ఒక సీఎంగా కాకుండా.. ఒక రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాహుల్. కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోని కీలక శాఖలను చూస్తుందని అన్నారు. కాళేశ్వరం వల్ల కాంట్రాక్టర్లను మాత్రమే మేలు జరిగిందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూములు రికార్డులను మార్చి పేదలను ముంచారని తెలిపారు. భూస్వాములకే రైతుబంధు ఉపయోగపడిందని రాహుల్ విమర్శించారు.
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఎంఐఎం ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించారు రాహుల్. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పాలన ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంటులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో కుల గణన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సింగరేణిని ప్రవేట్ పరం కానివ్వమని అన్నారు.












Click it and Unblock the Notifications