డౌట్ లేదు.. మనదే గెలుపు: మెట్రో రైలు, సహా మహేశ్వరంపై కేసీఆర్ వరాలు, కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ మనమే(బీఆర్ఎస్) గెలుస్తామని.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశామన్నారు.
హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని.. ఇప్పుడు అదే కార్యక్రమంతో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారన్నారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు.

ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో నీటి కష్టాలు తీరిపోతాయన్నారు సీఎం కేసీఆర్. అడవులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. 'వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలె' అనే పాట రాసినట్లు చెప్పారు. ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీకి రూ. 100 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తామన్నారు.
అంతేగాక, బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరంలోని కందకూరు వరకు మెట్రో తెచ్చేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరి ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించినవారు ఏడో స్థానానికి పోయారన్నారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలు మీరు చూస్తున్నారు. తుమ్మలూరుకు రూ. కోటితో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ హాల్ కు దశాబ్ది పేరు పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.
CM Sri KCR speaking at "Haritha Utsavam" program in Thummaluru village of Rangareddy Dist., being organised as part of the decennial celebrations of Telangana State formation. #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 https://t.co/CpKV6IuoOm
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2023
జల్‌పల్లి, తుక్కుగూడకు చెరో రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. బబంగ్ పేట పురపాలికకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అటవీశాఖ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్ వారు చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారని కేసీఆర్ తెలిపారు.
కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశామని తెలిపారు.కొంత డబ్బులు కూడా సాయం చేశామన్నారు. తెలంగాణలో భారీగా ఫల వృక్షాలు పెంచాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్‌గా ఉందన్నారు.












Click it and Unblock the Notifications