తెలంగాణకు అలర్ట్: మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్లు కూడా
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే, మరో ఐదారు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కురిసన వర్షాలతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని.. మళ్లీ వానలు పడితే ఆ నష్టం భరించలేమని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉత్తరదక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల ఐదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేగాక, ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల వడగండ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. పలు ప్రాంతాల్లో 30-40 కిలోమీటర్ల వేగతంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గురువారంనాడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ వేసవి కాలంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలతోపాటు వరి ధాన్యం కూడా వర్షంలో తడవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వరితోపాటు ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో వరి, మామిడి, మొక్కజొన్న, పండ్ల తోటలు, ఇతర పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. పలు ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో గంటలకొద్ది విద్యుత్ సరఫరా నిలిచిపోవడంో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ.. సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురుస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications