బాబోయ్ చలి.. బయటికి రావొద్దని వార్నింగ్ !
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడం సాధారణమే కానీ.. ఈసారి వాతావరణం మరింత భిన్నంగా మారినట్టు కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటుండగా.. సాయంత్రం ఆరు గంటల నుంచే చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

కాగా అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఈ పరిస్థితి డిసెంబర్ 31 వరకు మాత్రమే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని తెలిపింది. అలానే జనవరి ప్రారంభంలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండి సంక్రాంతి సమయంలో మళ్లీ చలి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో వైద్యులు ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వారు చెబుతున్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని వెల్లడించారు.
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతున్నాయి. శనివారం మినుములూరు 5, అరకులో 5, అరకు 7, పాడేరు 7 డిగ్రీల చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు చలి గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications