ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు: మరో రెండ్రోజులపాటు, మత్స్యకారులకు అలర్ట్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. అప్పుడప్పుడు కొంత తెరిపి ఇచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత భారీ వర్షాలతో విరుచుకుపడుతున్నాడు వరుణుడు. మరో రెండు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.

తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాగల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీలోనూ రెండ్రోజులపాటు భారీ వర్షాలు, కోస్తాకు అలర్ట్
ఇది ఇలావుండగా, ఏపీలోనూ రానున్న రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటలపాటు కోస్తాలోని ప్రజలు అప్రమ్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. కోస్తా వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. డెల్టా కాల్వలకు 6 వేల క్యూసెక్కుల నీటిని అందిస్తున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
కాగా, భారీ వరదల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి 9,35,465 క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు, జూరాలకు లక్ష 99 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇప్పటికే జలాశయం నిండటంతో.. 38 గేట్లు ఎత్తి 2లక్షల 24వేల క్యూసెక్కులు శ్రీశైలంకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.750 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 8.087 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కూడా గరిష్ఠ స్థాయికి చేరడంతో.. 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదులుతున్నారు.












Click it and Unblock the Notifications