హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు: లోతట్టు ప్రాంతాలు జలమయం, ఏపీలోనూ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా కదులుతున్నాయి. గురు, శుక్రవారాల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
బుధవారం మధ్యాహ్నం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు ఉక్కపోత వాతావరణం ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం..
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
చందానగర్‌లో10.25 సెం.మీ, కాప్రాలో10.13 సెం.మీ, ఉప్పల్‌లో 9.53 సెం.మీ, బాలానగర్‌లో 8.48 సెం.మీ, సరూర్ నగర్‌లో 7.98 సెం.మీ, బేగంపేటలో 8.45 సెం.మీ, మూసాపేటలో 7.13 సెం.మీ, హయత్‌నగర్‌లో 7.98 సెం.మీ, ఖైరతాబాద్‌లో 6.53 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక శేరిలింగంపల్లి సర్కిల్‌లో 6.43 సెం.మీ, కూకట్‌పల్లిలో 5.48 సెం.మీ, అమీర్‌పేట్ 4.78 సెం.మీ, షేక్‌పేట్ 4.75 సెం.మీ, మల్కాజిరి 5.25 సెం.మీ, జూబ్లీహిల్స్ 5.1 సెం.మీ, ఎల్బీ నగర్ 5.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Recommended Video

ఏపీలోనూ వర్షాలు: 11న అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి నెల్లూరు జిల్లా వరకు బుధవారం వర్షాలు కురిశాయి. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. కోస్తా తీరం వెంట గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. జులై 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications