తెలంగాణకు ఎల్లో అలర్ట్: రానున్న రెండో రోజులపాటు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అంతేగాక, తెలంగాణ రాష్ట్రానికి 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది. మరోవైపు, శుక్రవారం నాడు కుమ్రం భీం ఆసిఫాబద్‌లో అత్యధికంగా 73.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో 62.2 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది.

ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారంనాడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications