ప్రత్యేక హోదాపై బాబు మౌనం, ఓటుకు నోటుతో లింక్: కెసిఆర్‌కు హ్యాపీ!
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకున్న వైసీపీ నేతలు పదేపదే ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు.
ఢిల్లీ వేదికగా ఓటుకు నోటు అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదేపదే ప్రస్తావించడం గమనార్హం. చంద్రబాబు కుంభకోణాల్లో చిక్కుకుపోయారని, ముఖ్యంగా ఓటుకు నోటు కేసు వల్ల కేంద్రాన్ని ప్రత్యేక హోదా పైన డిమాండ్ చేయలేకపోతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా, పార్థసారథి, ధర్మాన ప్రసాద రావు తదితరులు ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక పైన మాట్లాడారు. పలువురు నేతలు ఓటుకు నోటు కేసు వల్లే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు డిమాండ్ చేయడం లేదని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు డిమాండ్ చేయకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసేనని చెప్పడం గమనార్హం.
తన పైన ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోని చంద్రబాబు కేంద్రంతో రాజీపడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆయన చిక్కుకుపోయారని మండిపడ్డారు.
జగన్ ఢిల్లీస్థాయిలో పదేపదే ఓటుకు నోటు అంశాన్ని ప్రస్తావించడం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాజకీయంగా ఒకింత మంచిదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు అంశాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెరపైకి తీసుకు రావడం కెసిఆర్‌కు హ్యాపీ అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications