అక్రమ సంబంధం: లవర్‌తో కలిసి భర్తను హత్య?, ఎలా చేధించారు?
హైదరాబాద్: అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గజ్వేల్ పట్టణంలో టీవీ మెకానిక్‌గా పనిచేసే మాస అచ్చారావు(40)కు జగదేవ్‌పూర్ మండలవాసి కవితతో 18 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కవిత గజ్వేల్‌లోనే ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించేది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ సర్పంచ్ సర్వుగారి యాదవరెడ్డితో కవితకు పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. యాదవరెడ్డితో కవిత పెట్టుకున్న అక్రమం సంబంధం చివరకు ఆమె భర్త అచ్చారావుకు తెలిసింది. దీంతో ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా సరే భార్య కవితలో ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
దీంతో అచ్చారావు ఏడాది క్రితం గజ్వేల్‌లో టీవీ మెకానిక్ దుకాణం తీసేశాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ టీవీ షోరూంలో ఎలక్ట్రీషియన్‌గా పనికి కుది రాడు. నిత్యం బస్సులో జూబ్లీ బస్టేషన్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి తన ద్విచక్రవాహనంలో విధులకు వెళ్లేవాడు.
ఈ క్రమంలో జనవరి 13 నుంచి అచ్చారావు అదృశ్యమయ్యాడు. తన భర్త ఇంటికి రాలేదని కవిత ఇచ్చిన సమాచారం మేరకు ఆమె సోదరుడు మహిపాల్‌రెడ్డి 14న సికింద్రాబాద్ వెళ్లి వాకబు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రోజు సాయంత్రం మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అచ్చారావు కన్పించడం లేదని ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకుని అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కవిత భర్త అచ్చారావును సినీ ఫక్కీలో హత్య చేశారని తెలిసింది. పథకం ప్రకారమే నిత్యం బస్సులో వచ్చే అచ్చారావును అతడి భార్య కవితతో ఫోన్ చేయించి ద్విచక్రవాహనంపై వచ్చే విధంగా పథకం పన్నారు.
తను జూబ్లీ బస్టాండు నుంచి బైక్‌పై బయల్దేరానని ఫోన్‌లో చెప్పగానే కవిత ఈ విషయాన్ని యాదవరెడ్డికి చేరవేసింది. దీంతో అప్పటికే తిర్మలాపూర్‌కు చెందిన కన్నారెడ్డి, ఆంజనేయులు గౌడ్‌లతో కలిసి రహదారిపై మాటువేసిన యాదవరెడ్డి... తుర్కపల్లి సమీపంలోకి రాగానే బైక్ వెనుక నుంచి అదే గ్రామానికి చెందిన కృష్ణకు చెందిన మాక్స్ వాహనంతో ఢీకొట్టారు.
కిందపడిన అచ్చారావును అందరూ కలిసి వెనక చేతులు కట్టేసి అదే వాహనంలో వేసుకుని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ యాదవరెడ్డికి చెందిన పౌల్ట్రీఫారాల సమీపంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. చేతులకు కట్టిన తాడుతోనే మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం అతడి కోసం జేసీబీతో తీసిన గుంతలోకి తోసేసి మట్టిపోశారు.

కేసు మిస్టరీని ఎలా చేధించారు?
కేసు దర్యాప్తులో భాగంగా ఈస్ట్ మారేడ్‌పల్లి పోలీసులు 3 నెలల నుంచి యా దవరెడ్డి, కవిత ఫోన్ నంబర్లను ట్యాప్‌చేశారు. వారి సంభాషణల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు కొంతకాలంగా తిర్మలాపూర్‌లో రెక్కీ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. మాక్స్ డ్రైవర్ కృష్ణను ముందుగా అదుపులోకి తీసుకుని విచారించి నిందితులను గుర్తించారు.
కృష్ణతోపాటు యాదవరెడ్డి, ఆంజనేయులుగౌడ్, కన్నారెడ్డి, కవితలను అదుపులోకి తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం యాదవరెడ్డిని తిర్మలాపూర్‌కు తీసుకువచ్చి అచ్చారావును పాతిపెట్టిన చోటును గుర్తించారు.
అహ్మద్‌నగర్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలను సేకరించారు.
అనంతరం జేసీబీతో 10 అడుగుల లోతులో నుంచి శవాన్ని వెలికితీశారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్ కళాధర్ సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. ఈస్ట్‌మారేడ్‌పల్లి సీఐ ఉమామహేశ్వర్‌రావు, తొగుట సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు పరుశురాం, కృష్ణలు వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు.












Click it and Unblock the Notifications