అసెంబ్లీకి వెళ్లే విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం?
ఎన్నికల ప్రచార సభలతోపాటు ఎన్నికల్లో ఓటు వేసే సమయంలోనే కేసీఆర్ కనిపించారు. మీడియాతో కూడా పెద్దగా మాట్లాడలేదు. వర్షం కారణంగా సికింద్రాబాద్ బహిరంగసభను రద్దు చేసుకుంటే.. ఆరోజు మీడియా సమావేశం పెడతారనుకున్నారుకానీ అది జరగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాత్రం ఫలితాలపై స్పందించలేదు. గవర్నర్ కు తన రాజీనామాను కూడా పీఏతో పంపించారు.
ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పై ప్రజలు పెద్ద భారం పెట్టారు. పదేళ్లు అధికారం ఇచ్చిన తర్వాత ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించాలని తీర్పు ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ శాసనసభలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పని చేయగలరా? లేదా? అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. వాస్తవానికి ఆయనకు ఎవరైనా ఇష్టం లేకపోతే వారిని చూడటానికి కూడా ఇష్టపడరని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి .. సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సిద్ధపడకపోవచ్చని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ రాజకీయాల వల్ల వేధింపులకు గురైంది రేవంత్ రెడ్డి ఒక్కరే. అయితే ప్రతీకారంతో కూడిన రాజకీయాలను రేవంత్ రెడ్డి చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ పై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారేకానీ వేధింపులకు గురిచేసే రాజకీయం చేయరని చెబుతున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తే తిరిగి అలా చేయరనే గ్యారంటీ ఉండదు కాబట్టి వాటికి దూరంగానే ఉంటారని చెబుతున్నారు. 119 స్థానాలున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64, సీపీఐ1, బీఆర్ఎస్ 39, బీజేపీ8, ఎంఐఎం 7 స్థానాలు సాధించాయి.












Click it and Unblock the Notifications