కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా? పవర్ కమీషన్ నోటీసులపై నోరు తెరుస్తారా? ఉత్కంఠ!!
తెలంగాణ మాజీసీఎం కెసిఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోందా? తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులపై ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అన్నది ఇప్పుడు తెలంగాణాలో చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ కు పవర్ కమీషన్ నోటీసులు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను విద్యుత్తు కొనుగోలుపైన, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్ల పైన వివరణ కోరింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది.

న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు
పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కెసిఆర్ కమిషన్ ను కోరారు. అయితే కమిషన్ జూన్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో రేపటితో గడువు ముగియనున్న క్రమంలో ఆయన ఏం సమాధానం చెబుతారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేసీఆర్ లిఖితపూర్వక వివరణ పంపించేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కేసీఆర్ వివరణ ఇవ్వకుంటే కమీషన్ ఏం చేస్తుంది
అయితే గడువులోగా ఆయన నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కు మళ్ళీ గడువును పొడిగిస్తుందా.. లేకా మళ్లీ సమన్లు జారీ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ లేకుండా ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, చత్తీస్గడ్, భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లపై విచారణ కొనసాగుతుందని, దీనిపై 25మందికి నోటీసులు ఇచ్చామని నరసింహారెడ్డి కమిషన్ పేర్కొంది.
జెన్కోకు సంబంధం లేకుండా గత ప్రభుత్వ కీలక నిర్ణయాలు
అయితే మాజీ సీఎం కేసీఆర్ నోటీసులకు ఇంకా సమాధానం ఇవ్వలేదని సమయం కావాలని అడుగుతున్నారని కూడా వివరించింది. నాడు కీలకమైన మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జెన్కోకు ఎటువంటి సంబంధం లేదని, భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని మొత్తం ఎంత నష్టం వచ్చిందనేది తేలాల్సి ఉందని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో కేసీఆర్ ఈజీగా బయటపడే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్రంలో టాక్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications