ఎమ్మెల్యేపై దాడి, ఎర్రబెల్లి అరెస్ట్: రేవంత్ వ్యాఖ్యలు నిజమవుతాయా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు ఒక్కటవుతాయా...? కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ - టిడిపిలు ఒక్కటయ్యే పరిస్థితిని కెసిఆర్ తెస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు మొదలు... నిన్నటి ఎన్‌కౌంటర్ల వరకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు.. ఇలా దాదాపు అందరు కూడా కెసిఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా నిర్లక్ష్యానికి గురవుతోందని విపక్షాలు అంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం, తమ పార్టీ ఎమ్మెల్యే, నేతల పైన అధికార టిఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడుతున్నారని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే పైన దాడికి పాల్పడిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజాగా, ప్రోటోకాల్ వివాదం కారణంగా టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావును పోలీసులు అరెస్టు చేశారు. ఇది, కుట్రపూరిత కేసు అని టిడిపి నేతలే కాకుండా.... ఆ పార్టీకి దూరం జరగాలనుకుంటున్న బిజెపి చెప్పడం కూడా గమనార్హం.
బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం మాట్లాడుతూ... ఎర్రబెల్లి అరెస్టు అక్రమమని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి - టిడిపిలు కలిసే ఉన్నాయి. అయితే, బిజెపి.. టిడిపి నుంచి దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి ఎర్రబెల్లి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రాజహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పైన కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్, టిడిపిలు కలిశాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి భుజాన్ని సబితా ఇంద్రా రెడ్డి తట్టారు కూడా.
కెసిఆర్ ప్రభుత్వంపై ఎప్పటికైనా విపక్షాలు ఒక్కటి అయ్యే అవకాశాలు లేకపోలేదనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజం కానున్నాయా? అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం పథకాలు ప్రకటించడం మినహా ఏం చేయడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే, ప్రాజెక్టుల రీడిజైన్‌ను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
వరంగల్ ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అది కుట్రగా అభివర్ణించాయి. మావోయిస్టు అజెండా అంటున్న టిఆర్ఎస్.. అదే మావోలను చంపేస్తోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
ఆదివారం హన్మకొండలోని వడ్డేపల్లిలో జరిగిన శృతి, సాగర్ (ఇటీవల వరంగల్ ఎన్ కౌంటర్లో మృతి చెందారు)ల సంస్మరణ సభకు వరవర రావు వచ్చారు.
ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అమానవీయంగా చంపేసిందని, ఇదే ఎన్‌కౌంటర్ కెసిఆర్ ప్రభుత్వ పతనానికి పునాదిరాయిగా మారబోతుందని మండిపడ్డారుచ. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కోసం అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రయివేటు బిల్లు పెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications