అప్పు కట్టలేదని ఏడు గంటలు భార్యాపిల్లల నిర్బంధం
సిద్ధిపేట: భర్త తీసుకున్న అప్పు తీర్చలేదని భార్యాబిడ్డలను ముప్పు తిప్పలు పెట్టారు. ఒంటరిగా దొరికిన తల్లీబిడ్డలను ఏడు గంటలపాటు నిర్బంధించి కనీసం మూత్ర విసర్జనకు వెళ్లకుండా దాష్టీకం ప్రదర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం వడ్డీవ్యాపారులు ఆటవికత ప్రదర్శించారు.
మీడియాలో ఈ మేరకు వార్తలు వచ్చాయి - నర్సాపూర్ మండలం గుడెంగడ్డ గ్రామానికి చెందిన జన్ముల మల్లేశ్ నర్సాపూర్‌లో శివాలయం వీధిలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలో కుంచెరుకల వీరమణి వద్ద ఏడాదిన్నర కిందట రూ. 20 వేలు అప్పు తీసుకొన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అప్పు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువవడంతో ఏడాది కిందట కొత్తగా కొనుగోలు చేసిన హీరోహోండా గ్లామర్‌బైక్‌ను అప్పజెప్పా డు. అది లోన్‌లో తీసుకోవడంతో ఫైనాన్స్‌సిబ్బంది వచ్చి తీ సుకెళ్లారు. అప్పటి నుంచి అప్పుకోసం మళ్లీ ఒత్తిడి పెరిగింది.
బుధవారం మల్లేశ్ భార్య సునీత తన కొడుకు ఆధార్‌కార్డు కోసం మూడేండ్ల కూతురు వందనతో కలసి మీ సేవ కార్యాలయానికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న కుంచెరుకల వీరమణితో పాటు మరికొంత మంది మహిళలు వచ్చి ఛాయ్ తాగుదామని సునీతను తీసుకెళ్లారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వాళ్ల గుడిసెల ఎదుట కూర్చోబెట్టారు. అప్పు కట్టాకే కదలాలని హూకుం జారీచేశారు.

కూతురు ఆకలితో ఏడుస్తున్నా అక్కడి నుంచి కదలనివ్వలేదు.. కనీసం మూత్రవిసర్జనకు వెళ్లకుండా అడ్డుపడ్డారని సునీత కన్నీరుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు సమాచారం ఇవ్వడం తో సాయంత్రం ఏడు గంటలకు పోలీసులకు వచ్చారు. విచారణ చేపట్టి సునీత, వీరమణిని పోలీస్టేషన్‌కు తరలించారు. వీరమణితోపాటు ఆమె భర్తపై కేసు నమోదుచేశారు.
కొన్ని రోజల కిందట నర్సాపూర్‌లో అప్పు చెల్లించకపోవడంతో బాధితుడి భార్యను ఓ వస్తువులా తమ నివాసాలకు బలవంతంగా కుంచెరుకల వ్యాపారి లాక్కెళ్లడం సంచలనం సృష్టించింది. కొన్ని నెలల కిందట మండల పరిధిలోని గొల్లపల్లికి చెందిన బొల్లు కిష్టారెడ్డి తన స్నేహితునికి అప్పుకు జమానాత్ ఉన్నాడు.
సకాలంలో అప్పు కట్టలేకపోవడంతో కుంచెరుకలవాళ్లు కిష్టారెడ్డి ఇంటికి చేరుకొని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. పరువుపోవడంతో మానసికంగా కుంగిపోయిన కిష్టారెడ్డి పొలం లో చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందాడు.












Click it and Unblock the Notifications