బ్లూఫిల్మ్స్ చూపిస్తూ లైంగిక వేధింపులు: టీ సచివాలయంలో మహిళ ఆత్మాహత్యాయత్నం
హైదరాబాద్: లైంగిక వేధింపులకు తాళలేక ఓ కాంట్రాక్టు కార్మికురాలు హైదరాబాదులోని సచివాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె రసాయనం తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది.
తెలంగాణ సచివాలయంలో కొంతకాలంగా ఓ కార్మికురాలు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తుంది. తోటి సిబ్బంది ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సచివాలయంలోని ‘డి'బ్లాక్‌లో పనిచేస్తున్న తనపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండడంతో అవమానం భరించలేక రసాయనం తాగింది. దీంతో సిబ్బంది సమీపంలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.

సచివాలయంలోని సూపర్‌వైజర్లు, కొంత మంది సిబ్బంది ఆమెను లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిసింది. కార్యాలయంలోని కంప్యూటర్లలో నీలి చిత్రాలను ప్రదర్శిస్తూ ఆమెను శాడిస్టుల్లా వేధించేవారని తెలుస్తోంది. కార్మికురాలు ఏడాదిగా లైంగిక వేధింపులకు గురవుతోందని, సూపర్‌వైజర్లపై ఆరోపణలున్నాయని, ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
వేధింపులను తట్టుకోలేకనే కార్మికురాలు రసాయనం తాగిందని విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా కార్మికురాలు సూపర్‌వైజర్లపై ఏ పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని తెలిసింది.












Click it and Unblock the Notifications