అందాన్ని చూపి... పెళ్లిళ్లు: అమెరికా భర్తకు అడ్డంగా దొరికిన కిలేడీ
వరంగల్: ఓరుగల్లులో ఓ మాయాలేడీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. తన అందాన్ని ఎరగా వేసి ధనవంతులైన యువకులకు ఇంటర్నెట్ ద్వారా గాలం వేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారిపై అక్రమ కేసులు బనాయించి డబ్బులు వసూలు చేస్తుంటుంది.
వరంగల్ జిల్లాకు చెందిన ఆ యువతి వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలలో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ ద్వారా కొందరితో పరిచయం పెంచుకుంటుంది. తాను బాగా ధనవంతురాలిని అని చెప్పుకుంటుంది.
అందమైన భవనాలను తన ఇల్లుగా, బాగా బంగారు ఆభరణాలు ధరించిన దంపతుల ఫోటోలను తల్లిదండ్రులుగా చూపిస్తుంది. ఆరేళ్ల క్రితం వరంగల్ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఈ మాయాలేడీ వలలో పడ్డాడు. వారిద్దరి మధ్య పరిచయం, అది కాస్తా ప్రేమగా మారింది.

తన తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించరని, బయట చేసుకుందామని అతనితో చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు రాజీ కోసం ఆమెకు దాదాపు పది లక్షల రూపాయలు ఇచ్చారు.
రెండేళ్లకు మరో వ్యక్తి ఆమె వలలో పడ్డాడు. అతని నుంచి రూ.15 లక్షలు వసూలు చేసింది. షాకింగ్ విషయమేమంటో ఆమె గత ఏడాది ఎన్నారై పైన కన్నేసింది. హన్మకొండలోని ఓ హోటల్‌ను తన ఇల్లుగా చూపించింది. మార్వాడీ జంటను తల్లిదండ్రులుగా చూపిస్తూ ఫోటోలు పెట్టింది.
సదరు ఎన్నారై ఇక్కడకు వచ్చాక.. తన తల్లిదండ్రులకు ప్రేమ పెళ్లి ఇష్టంలేదని చెప్పి, వారికి తెలియకుండా పెళ్లి చేసుకుందామని చెప్పింది. మీ ఇంటికి వెళ్దామని అతను అడగగా.. మా తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పింది. అనంతరం వారు హైదరాబాదులో కాపురం పెట్టారు. క్రమంగా ఆమె ప్రవర్తన పైన భర్తకు అనుమానం వచ్చింది.
భార్యను అమెరికా తీసుకెళ్లాలని భావించిన ఆ భర్త పాస్‌పోర్టు కోసం వివరాలు అడిగాడు. ఆమె పెళ్లికి ముందు చెప్పిన వివరాలు, ఇచ్చిన సర్టిఫికేట్, ఇతర వివరాలలో తేడా ఉండటంతో అనుమానం వచ్చిన భర్త.. ఆమెను హైదరాబాదులో ఉంచి వరంగల్లో ఆమె గురించి వాకబు చేశాడు. ఆ తర్వాత అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లింది.












Click it and Unblock the Notifications