ఒకేసారి రెండు అవయవాల మార్పిడి: చరిత్ర సృష్టించిన ఉస్మానియా వైద్యులు
హైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒకే సమయంలో కష్టసాధ్యమైన రెండు అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి ఉస్మానియా వైద్యులు సత్తా చాటారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తినుంచి లివర్, కిడ్నీలను ఇద్దరు రోగులకు ఒకే సమయంలో మార్పిడి చేసి అసాధారణ ప్రతిభను చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.... నల్లగొండ జిల్లా రాజాపేటకు చెందిన శ్రీనివాస్ నగరంలోని ఈసీఐఎల్ చక్రిపురంలో నివాసముంటున్నారు. ఇతడికి ముగ్గురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు కావ్య (20), చిన్న కూతురు గౌతమికి విల్‌సన్స్ వ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి బారిన పడిన వారికి క్రమక్రమంగా కాలేయం చెడిపోతుంది.
అనంతరం దాని ప్రభావం మెదడుపై చూపిస్తుంది. తద్వారా రోగి శరీరంలో వణుకు మొదలై నడువలేని స్థితికి చేరుకుని మృత్యువాత పడతారు. భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీ టెక్ ఫైనల్ చదువుతున్న కావ్య 2004లో ఈ జబ్బు బారినపడింది. గతేడాది ఫైనలియర్ పరీక్షలు కూడా రాయలేకపోయింది.
ఆమె తండ్రి శ్రీనివాస్ రెండు నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యులకు చూపించగా, వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ కావ్య కాలేయం పూర్తిగా చెడిపోయిందని.. అవయవ మార్పిడి చేయాలని సూచించారు.

12 గంటల పాటు శస్త్ర చికిత్స
ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద అండరికి చెందిన సూర శ్రీనివాస్ ఈ నెల 2వ తేదీన నగరంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. బంధువుల అనుమతితో అతడి నుంచి సేకరించిన కాలేయాన్ని ఈ నెల 5వ తేదీన డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో 20 మంది వైద్యులు 12 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి కావ్యకు అమర్చారు.

ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
ప్రస్తుతం కావ్య ఆరోగ్యం నిలకడగా ఉండగా ఆమెను ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మరోవైపు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన రాములు (32)కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.

సూపరింటెండెంట్ డాక్టర్ జీవీఎస్ మూర్తి అభినందన
సర్జరీల్లో వైద్యులు పాండునాయక్, దీప్‌రాజ్‌సింగ్, బేబీరాణి, మాధవి, సాంబశివరావు, రవిమోహన్, మోక్షప్రసూన, రమేశ్, ప్రతాప్‌రెడ్డి, ఆదిల్, ఆదిత్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ల బృందాన్ని డీఎంఈ డాక్టర్ రమణి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవీఎస్ మూర్తి అభినందించారు. కాగా, త్వరలోనే శ్రీనివాస్ చిన్న కూతురు గౌతమికి కూడా జీవన్‌దాన్ ద్వారా కాలేయం సేకరించి శస్త్రచికిత్స నిర్వహిస్తామని డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు.

ఉస్మానియా వైద్యులకు మంత్రి అభినందనలు
కొంతకాలంగా ఉస్మానియా వైద్యులు అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో చేస్తున్న కృషిపై మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఖరీదైన వైద్యం ఉచితంగా నిరుపేదలకు అందాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా ఉస్మానియా వైద్యులు గొప్ప విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

కావ్య తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
కావ్య తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పదేళ్లుగా మా కూతురికి ఉన్న జబ్బు నయం చేయాలని ఎన్నో ఆసుపత్రులు తిరిగామన్నారు. ఏ వైద్యుడు కూడా పూర్తి స్థాయిలో నయం చేయలేకపోయారని, ఉస్మానియాలో డాక్టర్ మధుసూదన్ వంటి ప్రతిభ గల వైద్యులు ఉన్నారు.

జీవితాంతం రుణపడి ఉంటాం: కావ్య తండ్రి శ్రీనివాస్
ఆయన చేసిన శస్త్ర చికిత్స మూలంగా నా కూతురు ప్రాణాలతో బయటపడిందన్నారు. ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యుల బృందానికి, అన్ని రకాలుగా ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితోపాటు ఇతర అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications