కేసీఆర్ కేబినెట్‌పై కవిత విమర్శ: మహిళలకు స్ధానం లేకపోవడం విచారకరం
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని విషయం తెలిసిందే. దీనిపై అటు విపక్షాలతో పాటు, ఇటు ప్రజా సంఘాలు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవలే మహిళలతో భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు.
తాజాగా ఈ విషయంపై కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత నుంచి కూడా కేసీఆర్‌కు విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ కేబినెట్‌లో మహిళకు ప్రాతనిధ్యం లేకపోవడం తనను కూడా బాధిస్తోందని శుక్రవారం ఆమె వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిలో తాను కూడా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. యంగ్ ఫిక్కీ లేడీసీ ఆర్గనైజేషన్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన 'ఉమెన్ లీడింగ్ ద ప్యూచర్ ఆఫ్ ఇండియా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో మహిళలకు స్ధానం లేకపోవడం విచారకరమని అన్నారు. కానీ, కేబినెట్ కూర్పు చేయాలంటే ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా కులం, రాజకీయ పలుకుబడి, హోదా ఇలా ఎన్నో అంశాలుంటాయి. దానికి తోడు కేబినెట్‌లో ఇంత మంది మాత్రమే ఉండాలనే నిబంధన కూడా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ లో 18 మంది మంత్రులు మాత్రమే ఉన్నారని, ఈ కేబినెట్‌లో మహిళలకు తమ వంతు పాత్ర నిర్వహించే అవకాశం దక్కలేదని అన్నారు.












Click it and Unblock the Notifications